Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 74

Parasurama !!

||om tat sat ||

అథ రాత్ర్యాం వ్యతీతాయాం విశ్వామిత్రో మహామునిః|
అపృష్ట్వా తౌ రాజానౌ జగామోత్తర పర్వతమ్ ||
ఆశీర్భిః పూరయిత్వాచ కుమారాంశ్చ స రాఘవాన్ ||

"ఆ రాత్రి గడిచిన పిమ్మట మహాముని అగు విశ్వామిత్రుడు రాఘవునితో సహా కుమారులు అందరినీ ఆశీర్వదించి రాజులను వీడ్కొని ఉత్తరముగానున్న పర్వతములవేపు వెళ్ళెను".

బాలకాండ
డెబ్బది నాలుగవ సర్గ

ఆ రాత్రి గడిచిన పిమ్మట మహాముని అగు విశ్వామిత్రుడు రాఘవునితో సహా కుమారులు అందరినీ ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని ఉత్తరముగానున్న హిమవత్ప్పర్వతములవేపు వెళ్ళెను. విశ్వామిత్రుడు వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు మిథిలాథిపతి అగు జనకుని వీడ్కొలి తన పురమునకు బయలుదేరెను.

అయోధ్యానగరమునకు బయలుదేరి వెళ్ళుచున్న ఆ మహారాజుని ఆ నరాధిపుడు అగు జనకుడు అనుసరించెను. అ విదేహమహరాజు చాలా కన్యాధనము ఇచ్చెను. అనేకమైన వంద వేల ఆవులను కంబళులను పట్టువస్త్రములను ఇచ్చెను. దివ్యరూపముగల అలంకరింపబడిన ఉత్తమమైన గజ ఆశ్వ రథము లను దాసదాసీ జనములతో వారికి కన్యాధనముగా ఇచ్చెను. జనక మహారాజు పరమసంతుష్ఠుడు అయి ఉత్తమమైన వెండి బంగారములను ముత్యములు పగడములను కన్యాధనముగా ఇచ్చెను. చాలా ధనము ఇచ్చి ఆ రాజు యొక్క అనుమతిని స్వీకరించి ఆ మిథిలేశ్వరుడు తన అంతఃపురమును ప్రవేశించెను.

ఆ అయోధ్యాధిపతి అగు దశరథుడు తన బలములతోనూ పుత్త్రులతోనూ మహాత్ములైన ఋషులతోనూ కలిసి వెళ్ళెను. అలాగ ఋషిసంఘములతోనూ రాఘవునితోనూ ఆ రాజు వెళ్ళుచుండగా పక్షులు ఘోరముగా శబ్దముచేయుచుండెను. మృగములన్నియూ భూమిమీద ప్రదక్షిణ పూర్వకముగా తిరుగుచుండెను. వానిని చూచి ఆ రాజశార్దూలము అగు దశరథుడు వసిష్ఠుని ప్రశ్నించెను. "పక్షులు ఘోరముగా శబ్దములు చేయుచున్నవి. మృగములు ప్రదక్షిణపూర్వకముగా తిరుగుచున్నవి. నాహృదయముకంపించుచున్నది. మనస్సు కలవరపడుతున్నది". దశరథమహారాజు యొక్క ఈ మాటలను విని మహా ఋషి మధురమైన మాటలతో ఇట్లు పలికెను. "దీని ఫలమును వినుము. పక్షిముఖముగా వచ్చినది రాబోవు ఘోరమైన భయమును ఈ మృగములు దాని ఉపశమును సూచించుచున్నవి.కావున సంతాపము వలదు".

వారు అట్లు మాట్లాడుచుండగా పెద్ద గాలి వీచెను. భూమి కంపించెను. ఆన్ని చెట్లూ పెకిలింపబడెను. సూర్యుడు చీకట్లలో మునిగెను. అన్ని దిక్కులకాంతులు పోయెను. భస్మముతో కప్పబడిన ఆ సైన్యములన్నియూ నిశ్చేష్ఠులాయెను. వసిష్ఠుడు తదితర ఋషులు రాజపుత్రులు రాజు చైతన్యముగలవారై ఉండిరి. మిగిలవారందరూ చైతన్యము కోల్పోయిరి.

ఆ ఘోరమైన చీకట్లలో భస్మముతో కప్పబడిన ఆ సైన్యము భయంకరరూపముతో జటామండలములను ధరించిన వానిని చూచెను.
అతడు జమదగ్నికుమారుడు అయిన పరశురాముడు, కైలాసమువలె దుర్జయుడు, కాలాగ్ని వలే సహింపబడలేని వాడు
జ్వలించుచున్న అగ్నిరాశులతేజస్సు కల , జనులకు నిరీక్షింపబడలేని వాడు. అతడు భుజముపై గొడ్దలితోనూ, మెఱుపుతీగలవలె విద్యుత్కాంతిగల ధనుర్బాణములను ధరించి త్రిపరాంతకుడైన శివుని వలె నుండెను.

జపహోమపరాయణులగు వసిష్ఠ ప్రముఖులు ఆ మునులందరూ భయంకరమైన రూపముగల అగ్నివలే తేజరిల్లు చున్నవానిని చూచి తమలో తామే తర్కిచుచుండిరి. "చంపబడిన తండ్రిని వలన కలిగిన కోపముతో క్షత్రియులను చంపుటకు వచ్చినవాడా ఏమి? పూర్వము క్షత్రియులను వధించి శమించిన వాడు. మళ్ళీ క్షత్రియులను పరిమార్చవలెనను కోరికతో రాలేదు కదా"అని . ఇట్లు అనుకొని భయంకరరూపుడైన భార్గవునకు అర్ఘ్యపాద్యములిచ్చి ఋషులు "రామా రామా" అని మథురముగా పలికిరి.

ఋషులచే ఇవ్వబడిన ఆ పూజలను గ్రహించి ప్రతాపవంతుడైన ఆ జమదగ్ని కుమారుడు శ్రీరామునితో ఇట్లు పలికెను.

ఈ విథముగా వాల్మీకి రామాయణములో్ని డెబ్బది నాలుగవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్ ||

ప్రతిగృహ్య తు తాం పూజాం ఋషిదత్తాం ప్రతాపవాన్ |
రామం దశరథిం రామో జామదగ్న్యో అభ్యభాషత ||

"ఋషులచే ఇవ్వబడిన ఆ పూజలను గ్రహించి ప్రతాపవంతుడైన ఆ జమదగ్ని కుమారుడు రాముని తో ఇట్లు పలికెను".

||ఓమ్ తత్ సత్ ||

||om tat sat ||

 

 


||om tat sat ||